తెలంగాణ 'చేయూత' పెన్షన్ యాప్ ప్రారంభం:మేడ్చల్‌లో పైలట్ ప్రాజెక్ట్ పరిశీలన!
హైదరాబాద్:మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ధర్మారం గ్రామంలో 'చేయూత' పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జోరందుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన చేయూత పెన్షన్ యాప్ పనితీరును పరిశీలించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో ఈ యాప్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించడానికి ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగారు.
అధికారుల క్షేత్రస్థాయి పర్యటన !
పెన్షన్ డైరెక్టర్ గోపాలరావు స్వయంగా ధర్మారం గ్రామాన్ని సందర్శించి, యాప్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియను నిశితంగా పరిశీలించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత మరియు గీత కార్మికుల వివరాలను ఈ సందర్భంగా తనిఖీ చేయనున్నారు. అలాగే, దరఖాస్తుల నమోదు సమయంలో సిబ్బందికి ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయా అనే దానిపై ఆరా తీసి తక్షణ పరిష్కార మార్గాలను సూచించనున్నారు.
అధికారులకు ప్రత్యేక లాగిన్ ఐడీలుతో - ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా జరిగేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పెన్షన్ యాప్‌లో ఎంపీడీవో (MPDO), ఎంపీఓ (MPO), మరియు ఎంఏఓ (MAO) అధికారులకు ప్రత్యేకంగా లాగిన్ ఐడీలను కేటాయించారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, ఉండటం కోసం ఒక్కో అధికారికి కేవలం 15 దరఖాస్తుల చొప్పున బాధ్యతను అప్పగించారు.ఈ నిబంధనల ప్రకారం అధికారులు నేరుగా అర్జీదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను సేకరిస్తారు. ఎక్కడా ఎలాంటి మధ్యవర్తులకు అవకాశం లేకుండా, సేకరించిన సమాచారాన్ని అక్కడికక్కడే నూతన యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత.
రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ
ధర్మారంలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తిగా విజయవంతమైతే, ప్రభుత్వం దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే అర్హులైన నిరుపేదలకు పెన్షన్ దరఖాస్తుల పరిశీలన మరియు మంజూరు ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.