బతుకమ్మ 9 రోజుల పేర్లు: Bathukamma Festival History & 9 Days Dates !
తెలంగాణ సంస్కృతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన పండుగ 'బతుకమ్మ'. ఎక్కడో మూలాల నుంచి నడచి వస్తున్న ఈ ఆచారం, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక. చెరువులు నిండి, కళకళలాడే పచ్చని వాతావరణంలో, రంగు రంగుల పూలతో అమ్మవారిని కొలిచే ఈ వేడుకను కేవలం ఒక పండుగలా కాకుండా, ఒక జీవన విధానంగా భావిస్తారు. అందుకే నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం జూన్ 26, 2014న బతుకమ్మ మరియు బోనాలు పండుగలను అధికారిక రాష్ట్ర పండుగలుగా ప్రకటస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2026 సంవత్సరంలో ఈ పూల పండుగ వేడుకలు అక్టోబర్ 10 శనివారం నుండి అక్టోబర్ 18 ఆదివారం వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, తొమ్మిదో రోజైన అక్టోబర్ 18న అత్యంత ప్రాముఖ్యమైన సద్దుల బతుకమ్మ వేడుకలతో ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు ముగుస్తాయి.
బతుకమ్మ పుట్టుక?
చరిత్రకారుల కథనాల ప్రకారం, చోళ రాజుల కాలంలో ధర్మంగద అనే రాజు పరిపాలనలో ధర్మపురిలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ రాజు ఓడిపోవడం, ఆ తర్వాత జరిగిన విషాదాల నేపథ్యంలో రాజకుమారి గౌరి దేవిని వేడుకుంటూ పూలతో పూజలు చేయడం ప్రారంభించిందని చెబుతారు. ఆ తర్వాత కాలంలో క్రమంగా ఇది తెలంగాణ ప్రజల జీవన విధానంలో కలిసిపోయి, అస్థిత్వానికి ప్రతీకగా నిలిచింది.
పౌరాణిక కథ: పార్వతీ దేవి మహిషాసురుడితో తొమ్మిది రోజులు భీకరంగా పోరాడి, విజయదశమి రోజున రాక్షసుడిని సంహరించి అలసటతో మైమరచి నిద్రపోతుంది. ఆమెకు మళ్లీ ప్రాణం పోసి, ఉత్సాహాన్ని నింపడానికి ప్రజలు రంగురంగుల పూలతో అమ్మవారిని అలంకరించి పూజలు చేశారని, అదే బతుకమ్మగా మారిందని మరో నమ్మకం.
సద్దుల బతుకమ్మ లేదా సద్దుల పండుగ అనగానే మన ఊర్లలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. అంగట్లో దొరికే కృత్రిమ పూలు కాకుండా, అడవుల్లో, పొలాల గట్ల మీద దొరికే తంగేడు, గునుగు, బంతి, చేమంతి వంటి పూలను సేకరించి అమ్మవారి రూపంలో పేర్చడం ఇక్కడ ప్రత్యేకత. బతుకమ్మ అంటే 'బతుకమ్మా' అనగా 'జీవించు తల్లీ' లేదా 'మమ్మల్ని బతికించు తల్లీ' అని అర్థం. ప్రకృతిలోని జీవశక్తిని పూలలో చూసి కొలిచే ఏకైక పండుగ ఇది.
Bathukamma Festival Dates:తొమ్మిది రోజుల పూజలు!
ప్రతి ఏటా అశ్వయుజ శుద్ధ పాడ్యమి (మహాలయ అమావాస్య మరుసటి రోజు) నుంచి ఈ వేడుకలు ప్రారంభమై, సద్దుల బతుకమ్మ (దుర్గాష్టమి ముందు రోజు) వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి.ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో పేరుతో అమ్మవారిని కొలుస్తారు:
మొదటి రోజు – ఎంగిలిపూల బతుకమ్మ:
మహాలయ అమావాస్య (పెత్రామస) రోజున ప్రారంభమవుతుంది.
విశేషం: పూలను ముందు రోజే తెచ్చి నీళ్లలో ఉంచి మరుసటి రోజు పేరుస్తారు కాబట్టి దీనిని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు.
నైవేద్యం: నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి సమర్పిస్తారు.
రెండో రోజు – అటుకుల బతుకమ్మ:
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది.
నైవేద్యం: అటుకులు, సప్పిడి పప్పు, బెల్లం కలిపి నివేదిస్తారు.
మూడో రోజు – ముద్దపప్పు బతుకమ్మ:
నైవేద్యం: ముద్దపప్పు, పాలు, బెల్లం కలిపి అమ్మవారికి సమర్పిస్తారు.
నాలుగో రోజు – నానబియ్యం బతుకమ్మ (నానే బియ్యం):
నైవేద్యం: నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు.
ఐదో రోజు – అట్ల బతుకమ్మ:
నైవేద్యం: గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో చేసిన దోశలను (అట్లు) నైవేద్యంగా ఇస్తారు.
ఆరో రోజు – అలిగిన బతుకమ్మ (అలక బతుకమ్మ):
విశేషం: ఈ రోజు అమ్మవారు అలిగి ఉంటారని భక్తుల నమ్మకం. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా ఎలాంటి నైవేద్యం సమర్పించరు.
ఏడో రోజు – వేపకాయల బతుకమ్మ:
నైవేద్యం: బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్ల ఆకారంలో (వేపకాయలు లాగా) చేసి నైవేద్యం పెడతారు.
ఎనిమిదో రోజు – వెన్నముద్దల బతుకమ్మ:
నైవేద్యం: వెన్న, నెయ్యి, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
తొమ్మిదో రోజు – సద్దుల బతుకమ్మ:
విశేషం: బతుకమ్మ పండుగలో అత్యంత వైభవంగా జరిగే ఆఖరి రోజు.
నైవేద్యం: ఐదు రకాల సద్దులు (పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం) ఘనంగా సమర్పిస్తారు.
Telangana Culture & Culture Bits (పోటీ పరీక్షల కోసం)
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యానికి సంబంధించి గ్రూప్స్ లేదా ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ (TSPSC) ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన Telangana Culture Bits ఇక్కడ ఇవ్వబడ్డాయి:
➥ బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారిక రాష్ట్ర పండుగగా ఏ సంవత్సరంలో ప్రకటించింది? (జవాబు: 2014 లో)
➥ బతుకమ్మ పండుగలో ఎక్కువగా ఉపయోగించే ప్రధానమైన పూలు ఏవి? (జవాబు: తంగేడు మరియు గునుగు పూలు)
➥ బతుకమ్మ పాటలలో ఎక్కువగా ఎవరి కీర్తనలు, పౌరాణిక గాథలు ఉంటాయి? (జవాబు: గౌరీ దేవి మరియు శివ పార్వతుల కథలు)
➥ బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేసే ఆచారాన్ని ఏమంటారు? (జవాబు: బతుకమ్మ నిమజ్జనం / సాగనంపడం)
➥ తెలంగాణ ఆడపడుచులు సద్దుల బతుకమ్మ రోజు ఏ పిండి వంటను నైవేద్యంగా సమర్పిస్తారు? (జవాబు: సద్దులు - అనగా పులిహోర, దద్దోజనం, కొబ్బరి అన్నం మొదలైనవి)
ముగింపు
కాలం ఎంత మారినా, టెక్నాలజీ ఎంత పెరిగినా మన సంస్కృతిని, మూలాలను మరచిపోకుండా ఉండేందుకు ఇలాంటి పండుగలు మనకు ఎప్పుడూ తోటపడుతుంటాయి. ఊరందరూ ఒక్కచోట చేరి, కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పాటలతో ఊరిని మార్మోగించే ఆ దృశ్యం వర్ణనాతీతం. ఈసారి బతుకమ్మ పండుగను మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జరుపుకోండి!
