శాటిలైట్ ఇంటర్నెట్: కేబుల్స్ లేకుండా అంతరిక్షం నుంచి నెట్!
ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క చర్చ నడుస్తోంది, అదే శాటిలైట్ ఇంటర్నెట్. మనం ఇప్పటివరకు వాడుతున్న ల్యాండ్‌లైన్ బ్రాండ్‌బ్యాండ్ లేదా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఇంటర్నెట్ యుగానికి తెరపడి, సరికొత్త అంతరిక్ష ఇంటర్నెట్ శకం మొదలుకాబోతోంది. ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ 'స్టార్‌లింక్' (Starlink) తో పాటు భారత్‌కు చెందిన జియో, ఎయిర్‌టెల్ మరియు వన్‌వెబ్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ విప్లవాత్మక సేవలను అందించడానికి సర్వం సిద్ధం చేస్తున్నాయి. అసలు ఈ టెక్నాలజీ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇది మనదేశంలో ఎలాపనిచేస్తుంది?దీనివల్లసామాన్యులకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
ఇంటర్నెట్‌కు, శాటిలైట్ ఇంటర్నెట్ తేడా?
ఇంతకాలం మనం ఇంటర్నెట్ వాడకం కోసం భూమి కింద వేలాది కిలోమీటర్ల ఫైబర్ కేబుల్స్ పై లేదా టవర్ల ద్వారా వచ్చే మొబైల్ సిగ్నళ్లపై ఆధారపడ్డాం. అయితే కొండ ప్రాంతాలు, దట్టమైన అడవులు, మారుమూల గ్రామాలు లేదా సముద్ర మధ్యలో ఉండే నౌకలకు ఈ కేబుల్స్ వేయడం అసాధ్యం లేదా అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఈ సమస్యలన్నింటికీ శాటిలైట్ ఇంటర్నెట్ పరిష్కారంగా మారుతోంది.
గతంలో వచ్చిన శాటిలైట్ కనెక్షన్లు భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల దూరంలో ఉండే జియోస్టేషనరీ ఆర్బిట్ లో ఉండేవి. దీనివల్ల సిగ్నల్ భూమి నుంచి అంతరిక్షానికి వెళ్లి మళ్ళీ వెనక్కి రావడానికి ఎక్కువ సమయం పట్టేది. ఫలితంగా హై లేటెన్సీ (Latency) ఏర్పడి, వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు లేదా ఆన్‌లైన్ గేమింగ్ ఆడేటప్పుడు ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా పనిచేసేది. కానీ, ఇప్పుడు రాబోతున్న కొత్త తరం శాటిలైట్ ఇంటర్నెట్ పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది.
స్టార్‌లింక్ & LEO టెక్నాలజీ
స్టార్‌లింక్ లాంటి ఆధునిక సంస్థలు భూమికి చాలా తక్కువ ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ (LEO) అనగా కేవలం 500 నుండి 2,000 కిలోమీటర్ల ఎత్తులోనే వేలాది చిన్న శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నాయి. ఇవి భూమి చుట్టూ అత్యంత వేగంగా పరిభ్రమిస్తూ ఉంటాయి.
ఇక వినియోగదారుల వైపు నుంచి చూస్తే, దీని సెటప్ చాలా సులభం. మన ఇంటి పైకప్పుపై లేదా బాల్కనీలో ఒక చిన్న డిష్ యాంటెన్నా (Dish Antenna) మరియు వైఫై రౌటర్‌ను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. నేరుగా అంతరిక్షంలో తిరుగుతున్న ఈ శాటిలైట్ల నుండి హై-స్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ నేరుగా మన డిష్‌కి అందిస్తాయి. దీనివల్ల మధ్యలో ఎలాంటి కేబుల్స్ అవసరం ఉండదు మరియు సిగ్నల్ వేగం కూడా ఫైబర్ ఇంటర్నెట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.
శాటిలైట్ ఇంటర్నెట్ భవిష్యత్తు
మన దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు కూడా శాటిలైట్ బ్రాండ్‌బ్యాండ్ లైసెన్సులు మరియు స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియ కోసం ప్రభుత్వంతో చర్చిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన అనుమతులు మరియు పాలసీల రూపకల్పన తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భారతదేశం లాంటి భౌగోళిక వైవిధ్యం ఉన్న దేశంలో ఈ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిమాలయ ప్రాంతాలు, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని దట్టమైన అడవులు, ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేని మారుమూల కుగ్రామాలకు సైతం ఎలాంటి అంతరాయం లేకుండా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కేవలం ఇండ్లకే కాకుండా సముద్రంలో వేటాడే జాలర్లకు, కార్గో నౌకలకు, విమాన ప్రయాణాల్లోనూ ఇది నిరంతర నెట్‌వర్క్‌ను అందిస్తుంది.
శాటిలైట్ ఇంటర్నెట్‌తో సమస్యలు
శాటిలైట్ టెక్నాలజీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, కొన్ని సవాళ్లు ,సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సాధారణ ఫైబర్ ఇంటర్నెట్‌తో పోలిస్తే శాటిలైట్ ఇంటర్నెట్ ప్రారంభ ధర మరియు పరికరాల (Equipments like Dish Antenna) ఖర్చు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే కాలక్రమేణా టెక్నాలజీ అభివృద్ధి చెంది, పోటీ పెరిగితే వీటి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆకాశంలో విపరీతమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు (భారీ వర్షాలు, తుఫానులు లేదా మబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు) ఏర్పడినప్పుడు సిగ్నల్స్ స్వల్పంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, పాత తరపు శాటిలైట్లతో పోలిస్తే ఎల్‌ఈవో (LEO) శాటిలైట్లు ఈ సమస్యను చాలా వరకు అధిగమించేలా డిజైన్ చేయబడ్డాయి. మరోవైపు, వేలాది శాటిలైట్లు అంతరిక్షంలో తిరగడం వల్ల స్పేస్ డెబ్రిస్ (అంతరిక్ష వ్యర్థాలు) మరియు ఖగోళపరిశోధనలకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలుకూడా వ్యక్తమవుతున్నాయి.
సామాన్యులకు మరియు వ్యాపార రంగానికి ప్రయోజనాలు
ఈ శాటిలైట్ బ్రాండ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తే కేవలం ఇంటర్నెట్ వినియోగదారులకే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఊరట లభిస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ విద్య (E-Learning), టెలిమెడిసిన్ (Telemedicine) వంటి సేవలు మారుమూల గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ అత్యంత సులభంగా చేరువవుతాయి. డాక్టర్లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలలోని ఆసుపత్రులు సైతం శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా పెద్ద పెద్ద నగరాల్లోని నిపుణులైన వైద్యుల సహాయంతో ఆపరేషన్లు లేదా వైద్య సలహాలు అందించవచ్చు.
డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ వ్యాపారాలు మరియు రిమోట్ వర్కింగ్ (Work from Home) చేసే వారికి నెట్ కనెక్షన్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది.మొత్తానికి "కేబుల్స్ లేకుండా అంతరిక్షం నుంచి నెట్" అనే అద్భుతం మన కళ్ల ముందే నిజం కాబోతోంది. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం పూర్తిగా మారిపోనుంది. మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరికీ (High-Speed) డిజిటల్ ప్రపంచాన్ని చేరువ చేయడంలో ఈ శాటిలైట్ బ్రాండ్‌బ్యాండ్ రానుంది.టెక్నాలజీ ప్రయాణం ఇలాగే కొనసాగితే, రాబోయే కాలంలో ఇంటర్నెట్ అనేది కేవలం భూమికి పరిమితం కాకుండా అంతరిక్షంతో ముడిపడిపోతుందేమో.
Read Also
తెలంగాణ 'చేయూత' పెన్షన్ యాప్ ప్రారంభం:మేడ్చల్‌లో పైలట్ ప్రాజెక్ట్ పరిశీలన!
More Updates
Visit Now-https://www.gopatech.in/
🎤
What is your reaction?
ఈ కథనంపై మీ స్పందన ఏమిటి?